Saturday, April 23, 2016

రివ్యూ: సరైనోడు

 ఆరు పాటలు.. నాలుగు ఫైటింగ్‌లు.. కొంచెం ఎమోషన్‌.. అన్నిటికంటే మించి హీరోయిజం. ఇవి ఉంటే చాలు.. కమర్షియల్‌ సినిమా తయారైపోతోందిప్పుడు. ఈ నాలుగూ ఏ స్థాయిలో ఉన్నాయన్న దాని మీదనే సినిమా జయాపజయాలు ఆధారపడుతున్నాయి. బోయపాటి శ్రీను సినిమాలూ వాటినే నమ్ముకొన్నాయి. ఈసారి ఆయనకు.. స్టైల్‌ జోడించే కథానాయకుడు దొరికాడు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రమే ‘సరైనోడు’. బోయపాటి శైలికి.. అల్లు అర్జున్‌ స్టైల్‌కీ లింకు ఎలా కుదిరింది? ‘సరైనోడు’ ఎలా ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.. పదండి.
కథేంటి?: గణ (అల్లుఅర్జున్‌) కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించడు. ఎంతటివాడికైనా ఎదురెళ్తాడు. స్థానిక ఎమ్మెల్యే దివ్య (కేథరిన్‌)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఇంట్లో వాళ్లు కూడా వీరిద్దరి ప్రేమని అంగీకరిస్తారు. అయితే.. ఎవరితోనూ గొడవ పెట్టుకోననే మాటిస్తేనే పెళ్లిచేసుకొంటానని షరతు విధిస్తుంది దివ్య. అమ్మవారి ముందు ప్రమాణం చేయబోతుండగా.. అక్కడికి మహాలక్ష్మి(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) వస్తుంది.
ఆమె కోసం మళ్లీ బరిలోకి దిగుతాడు గణ. మహాని వెంటాడుతున్న సమస్య పేరు.. వైరం ధనుష్‌ (ఆది పినిశెట్టి). అతను ముఖ్యమంత్రి కొడుకు. పర్ణశాల అనే గ్రామంలోని పంటపొలాల్ని బలవంతంగా లాక్కుని అక్కడ వ్యాపారం చేయాలనుకొంటాడు. అడ్డొచ్చినవాళ్లని చంపుతూ పోతుంటాడు. ఆ పర్ణశాలకీ మహాకీ సంబంధం ఏమిటి? ధనుష్‌ని గణ ఎలా ఎదిరించాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది?: కమర్షియల్‌ సూత్రాలకు అనుగుణంగా అల్లుకొన్న కథ ఇది. దుర్మార్గుడైన ప్రతినాయకుడు. అతన్ని ఎదిరించే కండబలం ఉన్న కథానాయకుడు. వారిద్దరి మధ్య పోరు. తెలిసిన చిన్న కథనే తీసుకున్న దర్శకుడు తనదైన శైలిలో కథనాన్ని నడిపించారు.
హీరోయిజం.. పోరాటాలు.. పాటలు.. బిల్డప్‌ షాట్స్‌.. ఇలా మాస్‌కి నచ్చే అంశాల్ని రంగరించారు బోయిపాటి. మాస్‌తో పాటు.. అల్లుఅర్జున్‌ అభిమానులకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం విడివిడిగా చూస్తే బాగానే ఉన్నట్టు అనిపించినా వాటిని కలిపే బలమైన కథ లేకపోవడం ‘సరైనోడు’లో కనిపించే ప్రధానమైన లోటు.
విశ్రాంతి ముందొచ్చే పోరాట ఘట్టం ఆకట్టుకుంటుంది. కోర్టు సన్నివేశంలో ఎమోషన్‌ని బాగా పండించారు. ద్వితీయార్థంలో అనుకోని మలుపులు పెద్దగా కనిపించవు. కామెడీని నమ్ముకున్నా ఆశించినంతగా పండలేదు. అయితే.. పతాక ఘట్టాలు మాత్రం ఆకట్టుకొంటాయి. అదే.. ‘సరైనోడు’ అనుకునేలా చేస్తుంది.
ఎవరెలా?: ఈ సినిమా కోసం అల్లుఅర్జున్‌ బాడీ పెంచాడు. కండ బలం చూపించాడు. మాస్‌కి నచ్చేలా మారిపోయాడు. యాక్షన్‌ ఘట్టాల్లో చాలా చురుగ్గా కనిపించాడు. తనకు అలవాటైన డాన్సుల్లో మరింత అలరించేలా చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని లాగించే ప్రయత్నం చేశాడు.
కేథరిన్‌ ఓకే అనిపిస్తుంది. రకుల్‌కి అంత స్కోప్‌ లేదు. ఆది పినిశెట్టి నటన ఆకట్టుకుంటుంది. ప్రతినాయకుడిగా బన్నీకి దీటుగా కనిపించాడు. బ్రహ్మానందం అప్పుడప్పుడు కాస్త నవ్విస్తాడు. శ్రీకాంత్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే. మిగిలినవాళ్లంతా తమ అనుభవంతో బండి లాగించేశారు.
తమన్‌ అందించిన బాణీల్లో రెండు బాగున్నాయి. ‘తెలుసా.. తెలుసా’ మంచి మెలోడీ. యాక్షన్‌ ఘట్టాల్ని తన నేపథ్య సంగీతంతో మరింత ఎలివేట్‌ చేశాడు. ద్వితీయార్థానికి కాస్త కత్తెర పడాల్సింది.. సినిమా అంతా స్టైలిష్‌గా తీశారు. రత్నం డైలాగులు అక్కడక్కడ పేలాయి. కథకుడిగా బోయపాటి కొత్తగా ఏం చేయకున్నా.. తన బలాలపైనే దృష్టి పెట్టాడు. బోయపాటి సినిమాల్లో ఏవైతే హైలైట్స్‌గా కనిపిస్తాయో.. సరైనోడులోనూ రిపీట్‌ అయ్యాయి.. మారింది హీరో మాత్రమే.
చివరిగా.. మాస్‌కి వీడు.. ‘సరైనోడు’