Tuesday, July 8, 2014

ప్రయివేటు దిశలో రైల్వే


మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్‌ ఓ వైపు సంపన్నుల సౌకర్యాలకు పెద్దÄపీట వేస్తూ మరో వైపు సామాన్యుడిని నిర్లక్ష్యం చేసింది. భారాలకు బాటలు వేసింది. బుల్లెట్‌, సెమీ బుల్లెట్‌ రైళ్లు, ప్రీమియం ఎసి రైళ్లు, రైల్వే స్టేషన్లలో వైఫై ఏర్పాటు, బయో టాయిలెట్లు, ఆన్‌లైన్‌లో నిమిషంలో 7200 టికెట్లు బుక్‌ చేసుకునే వీలు..ఇలా బ్రహ్మాండమైన సౌకర్యాల రంగుల చిత్రం చూపించారు. అదే సమయంలో సామాన్యుడి నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే చార్జీలు సంవత్సరానికోసారి బడ్జెట్‌ సమయంలో సమీక్షించే విధానానికి స్వస్తి పలికారు. ఇకపై రైల్వే వాడే ఇంధనాలు-బొగ్గు, డీజిల్‌, విద్యుత్‌- ధరల ఆధారంగా తరచూ చార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు మంత్రి సదానంద గౌడ. దీనికి తోడు ఈ బడ్జెట్‌లో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యానికి(పిపిపి), విదేశీ పెట్టుబడులకు ఎర్ర తివాచి పరిచారు. వీటి చరిత్ర మన దేశంలో కాని ఇతర దేశాల్లో కాని చూస్తే లాభాల వేటలో చార్జీల మోత భరించలేని స్థాయికి చేరడం ఖాయం. లైన్ల డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌లో తమ ప్రాధాన్యతని పేర్కొనడంలో ఉద్దేశం కూడా వీరికి లాభాలు చేకూర్చడమే. ఈ నిర్ణయంతో వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే లైన్లు వేసే సామాజిక బాధ్యతను విస్మరించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు మోడీ సర్కార్‌ మొండి చేయి చూపినట్లే. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నవిధంగా ఓ కమిటీ వేశాం దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల నుండి వ్యతిరేకతను తగ్గించే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులున్నాయి వాటికి 20,690 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. కేటాయింపుల ప్రస్తావనే లేదు. భారత రైల్వేలను కార్పొరేటీకరించే దిశగా తొలి అడుగులు వేసింది మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్‌.