Saturday, October 29, 2016

రివ్యూ: ధర్మయోగి


 కథేంటంటే?: ధర్మ, యోగి (ధనుష్‌) కవల పిల్లలు. ధర్మకి బుద్ధిబలం ఎక్కువ. యోగి మొండివాడు. చిన్నప్పట్నుంచే తండ్రితో తిరుగుతూ రాజకీయాలపై మమకారం పెంచుకొంటాడు యోగి. ధర్మ మాత్రం బాగా చదువుకొని కళాశాలలో అధ్యాపకుడు అవుతాడు. బాపట్ల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడంతో వూహించని రీతిలో ప్రజాస్వామ్య పార్టీ తరపున యోగికి ఎమ్మెల్యే టిక్కెట్‌ లభిస్తుంది. అధికారంలో ఉన్న ప్రగతిశీల పార్టీ తరపున యోగి ప్రియురాలు అయిన అగ్నిపూల రుద్ర (త్రిష)కి టికెట్టు వస్తుంది. ప్రేయసి, ప్రియుడు ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇంతలో యోగి హత్యకి గురవుతాడు. ఆ హత్య చేసిందెవరు? యోగి హత్య తర్వాత రుద్ర ఎన్నికల బరి నుంచి తప్పుకొని ఏం చేసింది? యోగి హత్యకి కారకులైన వాళ్లకి ఎవరు శిక్ష విధించారు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఒక పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇదే కథలో ఫ్యామిలీ డ్రామా కూడా మిళితమైంది. అధికారం కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తులు, పైఎత్తులు ఇదివరకు చాలా సినిమాల్లోనే చూశాం. ఇది కూడా ఆ బాపతు కథే. కాకపోతే ఓ యువజంట నేపథ్యంలో ఆ కథని తీర్చిదిద్దడమే ఇందులో కొత్తదనం. బలహీనుడైన ఓ తమ్ముడు అన్న చనిపోయాక మొండివాడిగా ఎలా మారాడు? అన్న ఆశయాన్ని ఎలా నెర వేర్చాడనే అంశం కూడా ఇందులో కొత్తగా అనిపిస్తుంది. తొలి సగభాగం కథంతా కూడా ధర్మ, అతడిని ఇష్టపడే అమ్మాయి మాలతి (అనుపమ)ల పరిచయం, ప్రేమ.... అలాగే యోగి, ఆయన ప్రియురాలైన అగ్నిపూల రుద్రల ప్రేమాయణం, రాజకీయ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల చుట్టూనే సాగుతుంది. మధ్యమధ్యలో పార్టీ ఆఫీసులు, రాజకీయ పరిణామాలతో సన్నివేశాలన్నీ సున్నితంగానే సాగిపోతాయి. విరామానికి ముందు నుంచే కథలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొంటాయి. అప్పటికప్పుడు యోగిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించడం, అదే సమయంలో అవతలి పార్టీ నుంచి కూడా అగ్నిపూల రుద్ర కూడా బరిలోకి దిగుతుండటంతో కథ రక్తి కడుతుంది. ప్రేమలో ఉన్న ఓ జంట పోటీ పడుతుండటంతో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగానే దర్శకుడు ద్వితీయార్ధంలో బోలెడంత డ్రామా ఉండేలా చూసుకొన్నాడు.
అయితే ఆ డ్రామా కొన్నిసార్లు ప్రేక్షకులని గందరగోళంలోకి నెట్టేసే స్థాయికి వెళ్లింది. ఒక పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉండటం, అసలు ఎవరు ఏ పార్టీకి చెందినవారో, ఎవరు ఎవరెవర్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుంటారో అర్థం కాదు. కానీ ఈ రకమైన కథని ఓ ప్రేమజంట నేపథ్యంలో తెరకెక్కించడం మాత్రం ప్రేక్షకులకి కొత్తదనాన్ని పంచుతుంది. ముఖ్యంగా రుద్ర వేసే ఎత్తులు, ఆమె ఎంపీగా ఎన్నికయ్యే విధానం మంచి డ్రామాని పండిస్తాయి. పతాక సన్నివేశాల్లో మాత్రం కొత్తదనం లోపించింది.
చివరిగా: రక్తికట్టించే రాజకీయం నేపథ్యంలో... ‘ధర్మయోగి’