Friday, September 30, 2016

రివ్యూ: హైపర్‌


 కథేంటంటే?: నిజాయతీ గల ఓ ప్రభుత్వాధికారి నారాయణమూర్తి (సత్యరాజ్‌). ఆయన కొడుకే సూర్య (రామ్‌). తండ్రి అంటే సూర్యకి ప్రేమే కాదు తండ్రి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి అనుమతినిస్తూ సంతకం చేయమని మంత్రి రాజప్ప (రావు రమేష్‌) నారాయణమూర్తి దగ్గరికి ఫైల్‌ పంపుతాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపడుతున్నారని.. సంతకం పెట్టనని నారాయణమూర్తి ఆ ఫైల్‌ని తిరస్కరిస్తాడు.
 దీంతో నారాయణమూర్తిపై కక్ష పెంచుకొన్న మంత్రి రాజప్ప సామదాన భేద దండోపాయాల్ని ప్రదర్శిస్తాడు. మంత్రి బెదిరింపులకు నారాయణ మూర్తి తన నిజాయతీని వదలుకున్నాడా? తన తండ్రిని మంత్రి టార్గెట్‌ చేశాడని తెలిశాక సూర్య ఏం చేశాడు? మంత్రికీ, సూర్యకీ మధ్య జరిగిన పోరాటంలో గెలుపెవరిది? సూర్యపై మనసుపడ్డ భానుమతి (రాశిఖన్నా) కథేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: తెలుగు చిత్రసీమ కొత్తదనం వైపు పరుగులు పెడుతున్న సమయమిది. ప్రేక్షకుడు చూడని ఓ కొత్త విషయాన్ని చూపించాలనే ప్రయత్నం తరచూ జరుగుతోంది. కొత్త రకమైన సినిమాలు రావటం వెనక ప్రధాన కారణం అదే. అలాగని మనకు అలవాటైన కమర్షియల్‌ ఫార్ములా కథలు ఇంకా దూరం కావడం లేదు. ఆ తరహా చిత్రాలకి బీ.. సీ కేంద్రాల నుంచి ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ కథల్ని నమ్ముతూ తెరకెక్కిస్తున్నారు.

‘హైపర్‌’ కూడా ఆ కోవకి చెందినదే. ఇందులోని కథ.. కథనం కొత్తదనం లేకున్నా కమర్షియల్‌ అంశాలకు కొరత లేకుండా చూశారు. పాటలు.. ఫైట్లు.. రొమాన్స్‌.. వాటి మధ్య ఓ రివెంజ్‌ డ్రామా.. ఇలా మాస్‌ ప్రేక్షకులకు కాలక్షేపాన్నిచ్చే అన్ని అంశాల్ని పక్కాగా ఉండేలా చూశారు. కొత్తదనం ఆశించే ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందే. తొలి సగం సరదా సన్నివేశాలతో తీర్చిదిద్దారు. రామ్‌.. రాశిఖన్నాల మధ్య వినోదం- రొమాన్స్‌.. కుటుంబ నేపథ్యంతోనే సాగిపోతుంది.
 
విరామానికి ముందే ఓ మలుపు వస్తుంది. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడు వూహించినట్టే సాగుతాయి. తన తండ్రిని కాపాడినందుకు రౌడీషీటర్‌ గజ (మురళీశర్మ)తో సూర్య ఫ్రెండ్‌షిప్‌ చేయడం.. మంత్రి రాజప్ప ఫోన్లో చెప్పినట్టుగా చేస్తూ సూర్య కార్లు మారుస్తూ వెళ్లిపోయే సీన్లలో పాత వాసన కనిపిస్తుంది. రామ్‌లోని హైపర్‌ యాక్టివ్‌నెస్‌ని అభిమానులకి చూపించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?: చిత్రంలో రామ్‌.. రాశిఖన్నా.. రావు రమేష్‌ల పాత్రలే కీలకం. ముగ్గురూ బాగా నటించారు. ముఖ్యంగా రామ్‌ ఎప్పట్లాగే హుషారైన కుర్రాడిగా సందడి చేశాడు. డ్యాన్సులు.. ఫైట్లు చక్కటి ఈజ్‌తో చేసేశాడు. రాశిఖన్నా అందంగా కనిపించింది. రావు రమేష్‌ మంత్రి రాజప్ప పాత్రలో ఒదిగిపోయారు. సత్యరాజ్‌ పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకొనేంత ఏమీ లేదు. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. జిబ్రాన్‌ పాటలు.. మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. అబ్బూరి రవి కలం అక్కడక్కడా మెరిసింది. రిమోట్‌తో ముడిపెడుతూ అమ్మాయిల జీవితం గురించి రాసిన మాటలు బాగున్నాయి.
 
చివరగా.. ఇది తెలిసిన ‘హైపర్‌’ 

No comments:

Post a Comment