Monday, December 12, 2011

నేడు రజనీకాంత్‌ పుట్టిన రోజు


 దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈరోజు తన 62వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. పసి వయస్సు నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న శివాజీరావ్‌గైక్వాడ్‌ స్వయం కృషితో రజనీకాంత్‌గా ఎదిగిన వైనం ఓ సినిమానే తలపిస్తుంటుందని సినీ విమర్శకులే అంటుంటారు. ఆయన జీవితం ఆధారంగా సినిమా తీస్తే, ఓ విజయవంతమైన సినిమాగా సినీ చరిత్రలో నిలిచిపోతుందని వారు అభిప్రాయపడుతుంటారు. ఐదేళ్ల వయస్సులోనే తల్లిని పొగొట్టుకున్న రజనీకాంత్‌ కడుపు నింపుకునేందుకు అనేక కష్టాలు పడ్డాడు. గవర్నమెంట్‌ స్కూల్‌లో కన్నడ మాధ్యంలో చదువుకున్నారు. అనంతరం జీవన సమరం చేశాడు. చివరకు మూటలు మోసే కూలీగా అవతారమెత్తారు. అనంతరం బస్సు కండక్టర్‌గా ఉద్యోగం కూడా చేశారు. రజనీకాంత్‌కు నాటకాలంటే పిచ్చి అభిమానం. ఎన్నో నాటకాల్లో నటించారు. సన్నిహితుల ప్రోత్సహంతో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. బాలచందర్‌ దృష్టిలో పడడంతో ఆయన దశ తిరిగింది. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ాఅపూర్వ రాగంగల్‌్ణ సినిమాలో నటించారు. 1975లో వచ్చిన ఈ సినిమాకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు రావడంతో శివాజీరావుగైక్వాడ్‌కు మంచి పేరు వచ్చింది. శివాజీరావుగైక్వాడ్‌ నుంచి రాజనీకాంత్‌గా పేరు మార్చింది బాలచందరే. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేస్తూ తనదైన స్టైల్‌తో దక్షిణాదిలో దూసుకెళ్లారు రజనీకాంత్‌. ఆయన స్టైల్‌ అభిమానులను ఇప్పటికీ అలరిస్తుంది. విదేశాల్లో రజనీకాంత్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రష్యన్లకు రాజ్‌కపూర్‌ అంటే ఎంతో ఇష్టం. అలానే జపనీస్‌కు రజనీ అంతే ఇష్టంగా మారారు. రజనీకాంత్‌ ప్రతి చిత్రం జపాన్‌లో విడుదల కావాల్సిందే. అతిసామాన్యంగా ఉంటూ అందరికీ ఆయన ఆదర్శనీయంగా కనిపిస్తారు. ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారని, మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

No comments:

Post a Comment