Thursday, June 9, 2016

ఒక ప్రశ్న... ముగ్గురి పోరాటం



చర్చి ఫాదర్‌ విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడు...
ఓ పోలీసు అధికారిణి న్యాయం కోసం చూస్తోంది...
ఓ తాత నిజం కోసం ఎదురుచూస్తున్నాడు...
ఈ ముగ్గురు కలసి ఒకే విషయమై పోరాటం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా వేధిస్తోన్న ఓ నిజాన్ని తెలుసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆ పోరాటం ఎవరిపై.. ఏ విషయంలో... ఎందుకు... అనే విషయాలు తెలియాలంటే ‘తీన్‌’ చూడాల్సిందే. అమితాబ్‌ బచ్చన్‌, విద్యా బాలన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. రిబుదాస్‌ గుప్తా దర్శకుడు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
‘‘పాప గురించి ఏమైనా తెలిసిందా’’
- తన కళ్ల ముందే కిడ్నాపైన మనవరాలి కోసం తాత జాన్‌ బిశ్వాస్‌ ప్రశ్న!
‘‘ఎనిమిదేళ్లుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు...’’
- ఇదీ పోలీసు అధికారిణి సరితా సర్కార్‌ సమాధానం!
‘‘అంతకుమించి నా దగ్గర ఇంకో ప్రశ్న లేదు...’’ కన్నీళ్లు తుడుచుకుంటూ జాన్‌ బిశ్వాస్‌ స్టేషన్‌ నుంచి బయటికొచ్చేస్తాడు.
ఇది పోలీసు స్టేషన్‌లో జరిగే ప్రధాన సన్నివేశం. పోలీసు స్టేషన్‌కు వచ్చేముందు జాన్‌ బిశ్వాస్‌ (అమితాబ్‌ బచ్చన్‌) ఓ టేపు రికార్డర్‌లో ఓ చిన్న పిల్ల మాటలు, ఏడుపు విని వస్తాడు. ఈ రోజే కాదు గత ఎనిమిదేళ్లుగా ఇంతే. స్టేషన్‌ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లకుండా రాత్రి వరకు వూరంతా ఓ పాప ఫొటో పట్టుకొని వెతుకుతూ ఉంటాడు. ఓ రోజు ఇలా పోలీసు స్టేషన్‌కు వెళ్తుంటే జాన్‌ కళ్లముందే ఓ చిన్న పిల్లాడు అపహరణకు గురవుతాడు. దీంతో సరితా సర్కార్‌ (విద్యా బాలన్‌) నేతృత్వంలో పోలీసు బృందం గాలింపు ముమ్మరం చేస్తుంది. గతంలో పోలీసుగా పని చేసి ప్రస్తుతం చర్చి ఫాదర్‌గా ఉంటున్న మార్టిన్‌ దాస్‌ (నవాజుద్దీన్‌ సిద్ధిఖీ) సహాయం తీసుకుంటారు. అడ్డంకులు దాటి ఆ ముగ్గురు ఈ మిస్టరీ చేధించారా? అనేదే కథ. దక్షిణ కొరియాలో విజయవంతమైన ‘మాంటేజ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అమితాబ్‌ బచ్చన్‌ నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణ.

No comments:

Post a Comment