Monday, July 4, 2016

ఓడినా ‘కప్’ ఇచ్చారు!

 ఏడు పదుల వయసులో ఏ ఆర్టిస్ట్ అయినా శరీరాన్ని కష్టపెట్టుకునే పాత్రలు చేయడానికి వెనకాడతారు. కానీ, అమితాబ్ బచ్చన్ వంటి కొంతమంది తారలు రిస్క్‌లు తీసుకోవడానికి రెడీ అయిపోతారు. ప్రస్తుతం నటిస్తున్న ఓ చిత్రంలో ఈ బిగ్ బి బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్లతో తలపడుతున్నారు. వాళ్ల ఉత్సాహం, ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేసిందనీ, వాళ్లతో బాక్సింగ్ రింగ్‌లో తలపడటం సవాల్‌గా అనిపించిందనీ అమితాబ్ అన్నారు. ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నా చిన్ననాటి విశేషాలు గుర్తొచ్చాయని అమితాబ్ చెబుతూ - ‘‘ఇష్టం ఉన్నా లేకపోయినా మా స్కూల్లో బాక్సింగ్ నేర్చుకోవాల్సిందే.

 పోటీల్లో ఒకే ఒక్క పాయింట్‌తో గెలుపోటములు ఆధారపడి ఉన్నప్పుడు భలే మజాగా ఉండేది. ఆ ఒక్క పాయింట్ దక్కించుకుని, ఆనందపడేవాణ్ణి. ఓసారి మాత్రం బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఓడిపోయాను. అయినా కప్ ఇచ్చారు. గెలుపు కోసం ధైర్యసాహసాలను మెండుగా ప్రదర్శించినందుకుగాను ఆ కప్ గెల్చుకున్నా. వాస్తవానికి నా ఎత్తు నాకు మైనస్ అయ్యింది.

 నా బరువేమో లోయర్ కేటగిరీ వాళ్లకు సమానంగా ఉండేది. ఎత్తు మాత్రం హయర్ కేటగిరీకి సమానంగా ఉండేది. దాంతో నన్ను హయర్ కేటగిరీకే ఎంపిక చేసేవాళ్లు. వాళ్లేమో ‘ఆలోచించుకో. విరమించుకుంటేనే నీకు మంచిది. లేకపోతే దెబ్బలు తగలడం ఖాయం’ అని హెచ్చరించేవాళ్లు. కానీ, నేను మాత్రం ఆ హెచ్చరికను ఖాతరు చేసేవాణ్ణి కాదు. మొండిగా తలపడేవాణ్ణి. ఇప్పడు సినిమా కోసం బాక్సింగ్ చేస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి’’ అని చెప్పారు.

No comments:

Post a Comment