Friday, September 30, 2016

రివ్యూ: ఎం.ఎస్‌.ధోనీ


 ధోనీ.. ఈ పేరు వింటే క్రికెట్‌ మైదానంలో పరుగుల వరద గుర్తొస్తుంది. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్‌ కీపర్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా ఆయన తిరగ రాసిన రికార్డులు కళ్లముందు కదలాడతాయి. టీమిండియా కూల్‌ కెప్టెన్‌గా ధోనీకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. భారత క్రికెట్‌ గర్వించే ఆటగాడిగా ధోనీ సాధించిన ఘనత అందరికీ తెలుసు. కానీ.. ఇంత గొప్ప స్థాయికి చేరడానికి ధోనీ చేసిన ప్రయాణమెలాంటిదో.. అందులోని మలుపులేంటో అంతగా తెలియదు.
ఆ విషయాలన్నీ ‘ఎం.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంలో చూడొచ్చని స్వయంగా ధోనీనే చెప్పారు. భారీ బడ్జెట్‌.. తెరపై రియల్‌ ధోనీలా హావభావాలు పండించేందుకు సుశాంత్‌సింగ్‌ చేసిన కసరత్తులు.. ప్రచార కార్యక్రమాల్లోనూ ధోనీ పాల్గొనడం ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. మరి.. ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటి?: ధోనీ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అందరిలాంటి పిల్లాడు. ఫుట్‌బాల్‌.. బ్యాడ్మింటన్‌.. టెన్నిస్‌ ఆటలంటే ఆసక్తి. కానీ.. అతని గురువు (రాజేశ్‌శర్మ) ధోనిలో మంచి క్రికెటర్‌ దాగి ఉన్నాడని గుర్తించి ప్రోత్సహిస్తాడు. ధోని తండ్రి(అనుపమ్‌ ఖేర్‌)కి మాత్రం కుమారుడు క్రీడల్లో కంటే బాగా చదివి ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అతని తల్లి.. సోదరి(భూమికా చావ్లా).. స్నేహితులు మాత్రం ధోనీని క్రీడల వైపు ప్రోత్సహిస్తారు. అయితే అతను విఫలమవుతూ.. తిరిగి ప్రయత్నాలు మొదలెడుతూ ఉంటాడు. మరి.. భారత్‌ తరఫున ఆడాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి అవరోధాలను అధిగమించాడు? అందుకోసం ఏం చేశాడు? రైల్వేలో ఉద్యోగం.. భారత క్రికెట్‌ టీంలో అవకాశం ఎలా వచ్చింది? ప్రేమ.. పెళ్లి వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పిల్లాడు.. దేశం తరఫున క్రికెట్‌ ఆడాలనుకోవడం.. లక్ష్యాన్ని చేరుకునేందుకు పడిన కష్టాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు కాస్త తడబడినా ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ప్రథమార్ధంలో ధోనీ బాల్యానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. స్కూలు.. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనటం.. రైల్వే ఉద్యోగంలో చేరి కొన్నాళ్లకు రాజీనామా చేయడం ఉంటుంది. ఇందులో కొత్తదనం లోపించినట్లు అనిపిస్తుంది.
ద్వితీయార్ధంలో ప్రియాంక (దిశా పటానీ)తో ప్రేమాయణం.. సాక్షితో పెళ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ విజయాలు ఉంటాయి. చిత్రంలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు సంబంధించిన ఫుటేజీలనే ఎక్కువగా చూపించారు.
చిత్రంలో ప్రధానంగా లోపించే అంశం.. కథ మొత్తం ధోనీ చుట్టూ తిప్పే ప్రయత్నంలో దర్శకుడు భారత క్రికెట్‌ దిగ్గజాలను పూర్తిగా పక్కన పెట్టేయటం పెద్ద కొరతగా చెప్పాలి. తెలియని విషయాల్ని చెబుతామని సినిమా ఉపశీర్షికలో చెప్పినా.. అలాంటివేమీ సినిమాలో కనిపించకపోవటంతో సగటు ప్రేక్షకుడు అసంతృప్తికి గురి అవుతాడు. ప్రియాంకతో ప్రేమాయణం తప్ప.. దాదాపు అందరికీ తెలిసిన ధోనీ విషయాలనే తెరపై చూపించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల జోలికే వెళ్లలేదు. బెట్టింగుల లాంటి వివాదాస్పద అంశాలను ఎక్కడా టచ్‌ చేయలేదు.
బయోపిక్‌ అంటే.. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటేనే ఆ చిత్రం బాగా రూపుదిద్దుకుంటుంది. కానీ.. ఇందులో అది లోపించిన వైనం ఇట్టే అర్థమవుతుంది. దర్శకుడు నీరజ్‌ పాండే పూర్తిగా ధోనీ చెప్పినట్లుగానే నడుచుకున్నట్లు చిత్రం చూస్తుంటే అర్థమవుతోంది. సినిమాటోగ్రఫీ.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా?: ధోని పాత్రలో సుశాంత్‌ సింగ్‌ జీవించాడు. రియల్‌ ధోనీలా హావభావాలు పలికించేందుకు అతను చేసిన కసరత్తు ఆకట్టుకోవటం ఖాయం. ధోనీ తొలి ప్రేయసి ప్రియాంక(దిశా పటానీ), రెండో ప్రేయసి.. భార్య సాక్షి(కైరా అడ్వాణీ)లను క్యూట్‌గా చూపించారు. ఇద్దరూ తమ పాత్రల్లో బాగానే మెప్పించారు. ధోనీకి తండ్రి పాత్రలో ‘అనుపమ్‌ఖేర్‌’ కనిపించరు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
 
చివరగా.. తెర మీదా తెలిసిన ‘ధోనీ’నే కనిపిస్తాడు. 

No comments:

Post a Comment