Thursday, January 7, 2016

ఆడకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాం

 ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య చివరి టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. చివరి రోజు ఆట సాధ్యం కావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్... ప్రత్యర్థితో ఓ వినూత్న ప్రతిపాదన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 112.1 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడకుండా డిక్లేర్ చేస్తుందని... వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి డిక్లేర్ చేస్తే... ఆ తర్వాత చివరి రోజు మిగిలే 70 ఓవర్లలో 370 లక్ష్యంతో తాము ఆడతామని ప్రతిపాదించాడు.

  కానీ వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ తమ జట్టు సభ్యులతో సంప్రదించి దీనిని తిరస్కరించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి 38 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (103 బంతుల్లో 122; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. 82 బంతుల్లో శతకం పూర్తి చేసిన వార్నర్... సిడ్నీ మైదానంలో వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వోజెస్ (ఆస్ట్రేలియా)కు రిచీ బెనాడ్ పేరిట పతకాన్ని ఇచ్చారు. ఇకపై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగే ఫ్రాంక్ వారెల్ ట్రోఫీలో ప్రతిసారీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన క్రికెటర్‌కు బెనాడ్ పతకం ఇస్తారు.


No comments:

Post a Comment