Tuesday, January 26, 2016

నా వ్యక్తిగత జీవితం మీకెందుకు?

 ‘దేశముదురు’లో సిమ్లా ఆపిల్‌లా ఆకర్షించింది హన్సిక. ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్‌ సంపాదించేసింది. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించింది. గతకొంతకాలంగా తెలుగు సినిమాలేం చేయకపోయినా తమిళనాట మాత్రం బిజీనే. ఆమె నటించిన చిత్రాలు కొన్ని అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తుంటాయి. ఇప్పుడు ‘కళావతి’గా భయపెట్టబోతోంది హన్సిక. ‘చంద్రకళ’ చిత్రానికి ఇది కొనసాగింపు. సిద్ధార్థ్‌, త్రిష, పూనమ్‌ బజ్వా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘చంద్రకళ’కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కళావతి’. ఇందులో నేను గర్భిణీగా కనిపిస్తా. ఈ పాత్రని ఓ సవాల్‌గా తీసుకొన్నా. గర్భిణీలు ఎలా నడుస్తారు? ఎలా కూర్చుంటారు? అనే విషయాలని నిశితంగా గమనించిన తరవాతే సెట్లో అడుగుపెట్టా. త్రిష, పూనమ్‌, నేనూ కలసి నటించాం. త్రిషకీ నాకూ మధ్య ఏవో గొడవలు జరిగాయని వార్తలొచ్చాయి. వాటిలో నిజం లేదు. తనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఈ సినిమాతో స్నేహితులమైపోయాం.
* నిజానికి దెయ్యం సినిమాలంటే నాకు చాలా భయం. ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చూడలేదు. ‘చంద్రకళ’, ‘కళావతి’ సినిమాల్నీ మా అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని చూశా. నటించేటప్పుడు మాత్రం ఎలాంటి భయం ఉండదు. కానీ చూడాలంటే మాత్రం ఒణుకొచ్చేస్తుంటుంది.
 
 * నటిగా నాకు తెలుగు, తమిళం రెండు భాషలూ ముఖ్యమే. ఎక్కడ మంచి కథలొస్తే అక్కడ నటిస్తా. తెలుగు సినిమాలకు నేనేం దూరం కాలేదు. మంచి కథ అనిపిస్తే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇప్పుడిప్పుడే తెలుగు భాషకూడా అర్థం అవుతోంది. కానీ... స్పష్టంగా మాట్లాడలేకపోతున్నా. 
* ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తుంటా. ఒత్తిడిలో ఉన్నాననిపిస్తే వెంటనే బ్రష్‌ పట్టుకొని... కూర్చుండిపోతా. ఏడెనిమిది గంటలు అలసట లేకుండా అలా బొమ్మలు వేస్తూనే ఉంటా. ఈమధ్యే రెండు బొమ్మలు వేశా. త్వరలోనే నా పెయింటింగ్స్‌తో ఓ ప్రదర్శన నిర్వహించాలని ఉంది. * నాకు తిండిపై ధ్యాస తక్కువే. చాలామంది తినడం కోసం బతుకుతారు. (నవ్వుతూ) నేను మాత్రం బతకడం కోసం తింటుంటా. ఇది వరకు బాగా బొద్దుగా ఉండేదాన్ని. సన్నబడాలని నాకే అనిపించింది. అందుకే ఇలా స్లిమ్‌ అయ్యా.
నా వ్యక్తిగత విషయాలు మీడియాలో వస్తుంటాయి. వాటిపై నేను స్పందించను. నా పని చూసి మాట్లాడండి. నా జీవితం గురించి మీకెందుకు? 30 మంది అనాధ పిల్లల్ని చేరదీసి వారి ఆలనా పాలనా చూసుకొంటున్నా. అదీ నా వ్యక్తిగతమే. నా మానసిక సంతృప్తి కోసం నేను ఎంచుకొన్న మార్గం అది. ప్రస్తుతం నా చేతిలో నాలుగు తమిళ చిత్రాలున్నాయి. తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు.

No comments:

Post a Comment