Wednesday, January 20, 2016

ప్రభాస్‌ నాకు మాట ఇచ్చాడు!

 
‘‘మంచి పాత్రలిస్తే నటించడానికి ఇప్పటికీ సిద్ధమే. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘రుద్రమదేవి’లో నేను చేసిన పాత్రలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. మరీ ముఖ్యంగా రామయ్య పాత్ర నాకు బాగా నచ్చింది. ఈ మధ్య వస్తున్న సినిమాలు ఓ కంట కనిపెడుతున్నా. వాటిలో ‘భలే భలే మగాడివోయ్‌’ నాకు బాగా నచ్చింది. కథానాయకుడిగా ఓ స్థాయిలో ఉన్న నాని, అలాంటి పాత్ర ఎంచుకోవడమే గొప్ప విషయం. నేను హీరోగా ఫామ్‌లో ఉన్న రోజుల్లో అయితే ఆ పాత్ర చేయకపోదునేమో? కథలు, పాత్రలు సమాజంలోంచి పుట్టాలి. అప్పుడే ప్రేక్షకులకు త్వరగా చేరువ అవుతాయి’’
గర్వంగా ఉంది
‘‘బాహుబలి’తో ప్రభాస్‌ స్థాయి పెరిగింది. తెలుగు సినిమా గురించి అమెరికాలోనూ గొప్పగా చెప్పుకొంటున్నారు. ‘ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు’ అని పిలుస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. ప్రభాస్‌తో తప్పకుండా ఓ సినిమా చేస్తా. గోపీకృష్ణ సంస్థలోనే ఆ సినిమా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధమవుతోంది. ప్రేమకథలో ప్రభాస్‌ తరహా యాక్షన్‌ జోడిస్తున్నాం. దర్శకుడెవరనేది త్వరలో చెబుతా. అందులో నేను నటిస్తానా, లేదా అన్నది కథని బట్టి ఉంటుంది. ‘ఒక్క అడుగు’ స్క్రిప్టు కూడా సిద్ధంగానే ఉంది. కానీ దేనికైనా సమయం రావాలి’’.
ప్రభాస్‌ పెళ్లి..
‘‘బాహుబలి’ తరవాత పెళ్లి చేసుకొంటా అన్నాడు ప్రభాస్‌. ‘బాహుబలి’ వచ్చింది, వెళ్లిపోయింది. ఇప్పుడు ‘బాహుబలి 2’ తరవాత చేసుకొంటా అంటున్నాడు. అందుకే మొన్న సంక్రాంతికి ప్రభాస్‌ దగ్గర మాట తీసుకొన్నా. ‘తప్పకుండా 2016లోనే పెళ్లి చేసుకొంటా పెదనాన్నా’ అని ఒట్టేశాడు.
ఈ యేడాది తప్పకుండా పెళ్లి కబురు వింటారు. అయితే ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది నేను చెప్పలేను. మేమే ఓ సంబంధం చూడాలనుకొంటున్నాం. తన మనసులో ఏముందో?’’
మినీ థియేటర్లు రావాలి
‘‘చిన్న సినిమాల్ని కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించాలి. ఆ పరిజ్ఞానాన్ని మనమే దిగుమతి చేసుకోవాలి. విదేశీ నిపుణులపై ఆధారపడే పరిస్థితి రాకూడదు. వంద, నూట యాభై మంది చూసేలా మినీ థియేటర్ల నిర్మాణం జరగాలి. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 14 లక్షలమందికీ ఓ థియేటర్‌ ఉంది. అందుకే ఓ బృందం ద్వారా మినీథియేటర్లపై పరిశోధన చేయిస్తున్నా. ఇక రాజకీయాల విషయానికొస్తే... ప్రస్తుతం భాజపాలోనే ఉన్నా. ప్రత్యక్షరాజకీయాల్లోకి దిగి ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలీదు. 2019 నాటికి నాలో ఓపిక ఉండకపోవచ్చు. ఎన్నికల ప్రచారం అంటే... చాలా హంగామా ఉంటుంది. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే కనీసం 400 గ్రామాలైనా పర్యటించాలి. అంతలా తిరగలేనేమో అనిపిస్తోంది’’

No comments:

Post a Comment