Wednesday, December 23, 2015

ఫిబ్రవరిలో మెకల్లమ్ రిటైర్మెంట్

 న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్... వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ తనకు చివరిదని తెలిపాడు. ఫిబ్రవరి 12న ఆసీస్‌తో ప్రారంభంకానున్న తొలి మ్యాచ్‌తో మెకల్లమ్ కెరీర్‌లో వందో టెస్టు పూర్తి చేసుకుంటాడు. తర్వాత 20 నుంచి జరిగే రెండో టెస్టు ఆడి రిటైర్ కానున్నాడు. అయితే మార్చి 8 నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌కు కేన్ విలియమ్సన్ కివీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
                  రిటైర్మెంట్ గురించి తర్వాత చెప్పాలనుకున్నా ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక నేపథ్యంలో ముందుగానే నిర్ణయాన్ని వెల్లడించానని తెలిపాడు. ‘ఆసీస్‌తో తొలి టెస్టు ముగిసే వరకు ఈ విషయాన్ని బహిరంగం చేయొద్దని భావించా. అయితే టి20 ప్రపంచకప్ జట్టులో నా పేరు లేకపోతే చాలా సమస్యలు, ఆందోళనలు ఏర్పడతాయి. దాన్ని తప్పించేందుకే నా నిర్ణయాన్ని ముందుగానే చెప్పేశా. కివీస్ తరఫున ఆడినందుకు చాలా గర్వపడుతున్నా’ అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు.



                   2002లో ఆసీస్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మెకల్లమ్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడి 11 సెంచరీలతో 6273 పరుగులు సాధించాడు. 254 వన్డేల్లో ఐదు సెంచరీలతో 5909 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల క్రిస్ కెయిన్స్‌కు సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చిన మెకల్లమ్.. తన వీడ్కోలుపై దాని ప్రభావం లేదని స్పష్టం చేశాడు.

No comments:

Post a Comment