Sunday, February 6, 2011

ఉపేంద్ర సినిమా ఆడియో విడుదల

 ఉపేంద్ర కథానాయకుడిగా నయనతార కథానాయికగా ఉపేంద్ర స్వియ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది. సినిమాకు ఎలాంటి పేరు పెట్టకుండా కేవలం సూపర్‌ అనే చేతి గుర్తును మాత్రమే పెట్టారు. ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఆడియో తొలిప్రతిని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విడుదల చేసి, సురేష్‌బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా రచయిత వెన్నలకంటి మాట్లాడుతూ...'ఉపేంద్ర అనగానే వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రంగా చెప్పక్కర్లేదు. చాలా ఉద్వేగమైన కథనంతో తెరపైకి రావటం ఆయన శైలి. సినిమాకు పేరు పెట్టకుండా ఒక భంగిమ పెట్టారు. ఎవరికి ఎలా అర్థమయితే అలా అన్వయించుకోవచ్చు. ఇదో అద్భుత ప్రయోగం. భారతదేశ ఔన్నత్యాన్ని కథలో చూపారు. పాటలు ఇష్టపడి రాశాను. హరికృష్ణ మంచి సంగీతాన్ని అందించారు. తెలుగులోనూ విజయవంతమవ్వాలని ఆశిస్తున్నా'నని అన్నారు.
ఆలీ మాట్లాడుతూ...'సినిమా సింబల్‌ చూస్తే అదిరింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈయన సినిమాలో నటించాలనుకున్నారు. అంతగా ఆయనకి నచ్చింది. కర్నాటకలో రూ.15 కోట్లు వసూళ్లు చేసింది' అని అన్నారు.
నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ...'గతంలో మజా అనే సినిమా తీశాను. మా బ్యానర్‌లో ఇది 25వ సినిమా. ఉపేంద్ర సినిమాను మూడు భాషల్లో ప్లాన్‌ చేశాం. కన్నడలో 75 రోజులుగా ఆడుతోంది. అక్కడ సూపర్‌ అనే టాక్‌ వచ్చింది. తెలుగువారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి' అని అన్నారు.
నిర్మాత డి.సురేషబాబు మాట్లాడుతూ...'రాక్‌లైన్‌ వెంకటేష్‌ మంచి మిత్రుడు. మంచి క్రియేటివిటీతో రూపొందిన చిత్రం. ఉపేంద్ర నిజంగానే సూపర్‌ హీరో కాబట్టి ఆ పేరు సరైందే. ఒక సినిమాకు టైటిల్‌ లేకుండా విడుదల చేసి, విజయవంతమవటం గొప్ప విషయం' అని తెలిపారు.
ఉపేంద్ర మాట్లాడుతూ...'అక్కడ సూపర్‌ అన్నారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా దీన్ని నిర్వచించుకోవచ్చు. వైవిధ్యమైన చిత్రం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇందులో విభిన్నమైన గెటప్స్‌ ఉంటాయి. సినిమా చూసి రజనీకాంత్‌ చాలా ఆనందపడ్డారు. కన్నడలో ఇది పెద్ద బడ్జెట్‌ చిత్రం. తెలుగులో మళ్లీ సినిమాలు చేసే అవకాశం వస్తుందని నమ్ముతున్నా'నని అన్నారు.

No comments:

Post a Comment