Sunday, January 30, 2011

రాజకుమారుని సినీ ప్రస్థానం .. .. ..

 మహేష్‌ బాబు నటజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్ణి కేంద్రీకరించడం కోసం మహేష్‌ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక సినిమా రంగానికి తిరిగివచ్చాడు. హీరోగా మహేష్‌ బాబు తన తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాదించకపోయినా మహేష్‌ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలిబింద్రే సరసన కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్‌కు తొలి హిట్‌ను అందించింది. ఆ తరువాత 2002లో వచ్చిన టక్కరిదొంగ, బాబీ రెండు సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి.
 2003లో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఒక్కడు' చిత్రం 2003 సంవత్సరంలో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం మహేష్‌ బాబు సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. అదే సంవత్సరంల విడుదలయిన నిజం చిత్రం పరాజయం పాలయ్యింది. 2003 సంవత్సరంలో మహేష్‌ బాబుకు ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో విడుదలైన అర్జున్‌ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని చెప్పాలి. ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.
 2005లో విడుదల అయిన 'అతడు' చిత్రం తెలుగునాట మాత్రమే కాకా విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. ఆ చిత్రం నందగోపాల్‌ పాత్రలో మహేష్‌ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్‌కు మరొకసారి బంగారు నంది లభించింది. 
2006లో మహేష్‌ బాబు నటించిన మరో భారీ హిట్‌ సినిమా 'పోకిరి'. వ్యాపారపరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ' సైనికుడు ' చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన ఏ సినిమా హిట్‌ కాలేదు. ' అతిథి ' ' ఖలేజా ' చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం మహేష్‌ బాబు శ్రీనువైట్ల దర్శకత్వంలో ' దూకుడు ' చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ' ది బిజినెస్‌మేన్‌' గా నటించనున్నాడు. ఈ చిత్రాలతో హిట్‌ సాధించి మరోసారి మహేష్‌ బిజినెస్‌ మ్యాన్‌గా, 'దూకుడు' ప్రదర్శిస్తాడని ఆశిస్తూ....
                                                                                      మీ స్నేహితుడు

No comments:

Post a Comment