Friday, January 6, 2017

ధోనికి పొగ పెట్టారా?

  భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని ఆకస్మికంగా వైదొలగాడనికి ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీవ్రస్థాయిలో కసరత్తు జరిపినట్లే కనబడుతోంది. ధోనిని నేరుగా పొమ్మనకుండా.. పొగ పెట్టి మరీ అతను కెప్టెన్సీ నుంచి సాగనంపారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ జట్టు పగ్గాలను ఉన్నపళంగా ధోని వదులుకోవడానికి కారణం మన సెలకర్లే అంటూ ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇందుకు  బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ వ్యవహరించిన తీరు కూడా బలాన్నిస్తోంది.

ప్రధానంగా త్వరలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ నేపథ్యంలో తగినంత ప్రాక్టీస్ చేసుకోవాలని భావించిన ధోని.. గుజరాత్-జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కు హాజరయ్యాడు. ఆ మ్యాచ్ లో ధోని ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, జార్ఖండ్ జట్టుకు అనధికార మెంటర్ గా వ్యహరించాడు. తన రాష్ట్ర జట్టులోని సభ్యులకు కొన్ని విలువైన సలహాలిస్తూ వారితో తన అనుభవాల్ని పంచుకున్నాడు. ఇదే క్రమంలో ఆ జట్టు ప్రాక్టీస్ లో కూడా పాల్గొన్నాడు. అయితే  గడిచిన బుధవారం నాల్గో రోజు ఆటలో అక్కడ ఉన్నట్టుండి చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ దర్శనమిచ్చారు. ధోనితో కూడా సమావేశమైన ఎంఎస్ కే.. సుదీర్ఘంగా చర్చించారు. ఇదంతా ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ కు కోహ్లికి జట్టు పగ్గాలు అప్పచెప్పాలని ఉద్దేశంతోనే ఐదుగురు సభ్యులతో కూడిన మన సెలక్టర్లు వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు కనబడుతోంది. ఆ క్రమంలోనే ఎంఎస్ కే అక్కడకు వెళ్లి ధోనికి అసలు విషయం చెప్పినట్లు సమాచారం. ఎంఎస్ కే తో సమావేశమైన అదే రోజు ధోని తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించడం కూడా అందుకు మరింత బలాన్నిస్తోంది. మరొకవైపు ధోని కెప్టెన్సీ నుంచి నిర్ణయం తీసుకున్న తరువాత ఎంఎస్ కే ఇచ్చిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్ణయాన్ని ఏడాది క్రితం కానీ, ఆరు నెలల క్రితం కానీ ధోని తీసుకుని ఉంటే తాము తప్పకుండా బాధపడేవాళ్లమంటూ ఎంఎస్ కే పేర్కొన్నాడు. ధోని సరైన సమయంలోనే కెప్టెన్సీ నుంచి వైదొలగాడంటూ ప్రశంసించాడు. అంటే ఇప్పుడు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే తమకు ఏమీ అభ్యంతరం లేదనే విషయాన్ని ఎంఎస్కే  చెప్పకనే చెప్పేశాడు. అయితే చీఫ్ సెలక్టర్ గా ఎంఎస్ కే చేసిన ప్రకటనపై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అనుమానం వ్యక్తం చేశాడు. విరాట్ కు పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పజెప్పాలనే సెలక్టర్లు భావించి ముందుగా ధోనికి ఆ విషయాన్ని తెలిపి ఉండవచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా భారత జట్టుకు ఎన్నో విజయాల్ని అందించిన  ధోని ఈ నిర్ణయాన్ని స్వతహాగా తీసుకున్నాడా? లేక సెలక్టర్లే పొగ పెట్టారా?అనేది మాత్రం కచ్చితంగా మిలియన్ డాలర్ల ప్రశ్నే.

No comments:

Post a Comment