Wednesday, June 1, 2016

పండుగొచ్చింది..

 
అంతటా పండుగ వాతావరణం, విద్యుత్ కాంతుల్లో నగరం, స్పెషల్ అట్రాక్షన్‌గా, అతిపెద్ద జెండా ఆవిష్కరణ, ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబు
కోట్ల కళ్లు ఎదురుచూస్తున్న పండుగ..అరవై ఏండ్ల కొట్లాట..వేయి మంది అమరుల బలిదాన ఫలితమైన రాష్ర్టావతరణ ఉత్సవం వచ్చేసింది. ఈ సంబురాలను అంబరాన్నంటేలా చేసుకునేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. నభూతో..నభవిష్యత్ అనే రీతిలో సిటీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు ప్రధాన కూడళ్లు విద్యుత్ కాంతులు, త్రీడీ లైటింగ్‌తో ధగధగలాడుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివళ్లు, జెండావిష్కరణలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించడానికి నగరం సిద్ధమైంది.

తెలంగాణ జాతికి పెద్ద పండుగొచ్చింది. రాష్ట్రం రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడోఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లతో పాటు ట్యాంక్‌బండ్, పర్యాటక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అసెంబ్లీ, సచివాలయం, నెక్లెస్‌రోడ్, హుస్సేన్‌సాగర్ తీరం, ైఫ్లె ఓవర్లు విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటున్నాయి. అమరవీరుల స్తూపాలను పూలతో అలంకరించారు. ప్రధానంగా నగర వీధుల్లో ఎక్కడచూసినా దసరా, దీపావళి లెక్కన ఉత్సాహం కనిపిస్తున్నది. 
 
నగరం..సప్తవర్ణశోభితం..
పురివిప్పిన నెమళ్లు, కనువిందు చేసే పూలు ఇంకా అనేక రకాల అలంకారాలతో నగర కూడళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైన నగరం సప్తవర్ణ శోభతో అలరారుతోంది. మరోపక్క పరేడ్ మైదానంలో వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు స్వాగతం పలుకుతూ హెచ్‌ఎండీఏ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. సంజీవయ్య పార్కులో ఎత్తైన జాతీయ పతాకం ఎగురవేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. దసరా, దీపావళి కలిసి వచ్చినట్టు నగరమంతా పండుగశోభను సంతరించుకుంది. 











 

No comments:

Post a Comment