Wednesday, April 6, 2016

ప్రజల కంటే ఐపీఎల్‌ క్రికెట్‌ ముఖ్యమా?

బీసీసీఐని నిలదీసిన బాంబే హైకోర్టు
మహారాష్ట్ర ప్రజల కంటే ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ ముఖ్యమా? అని బాంబే హైకోర్టు బుధవారం బీసీసీఐని నిలదీసింది. మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో ఏప్రిల్‌ 9నుంచి మే 29 వరకు మొత్తం 20 క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించవలసి ఉంది. క్రికెట్‌ పిచ్‌లను ఒక సారి తడిపేందుకు సుమారు 60 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. మహారాష్ట్రలో రాజధాని ముంబయితో సహా పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అందువల్ల క్రికెట్‌ మ్యాచ్‌లను నీటి ఎద్దడి లేని రాష్ట్రాల్లో నిర్వహించుకోవాలని బీసీసీఐకి హైకోర్టు సూచించింది. నీటి ఎద్దడి సమస్యకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండగా, పిచ్‌లను తడపడానికి నీటిని వృధా చేస్తే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాకుండా ఇక్కడ తాగునీటి ఎద్దడి ఉన్న విషయం మీకు తెలియదా? అని కూడా ప్రశ్నించింది. 2015లో అనావృష్టి వల్ల 3,228 మంది ఆత్మహత్య కు పాల్పడ్డారని జర్నలిస్టు తిరోడ్కర్‌ హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల బీసీసీఐ వినియోగించే ప్రతి నీటి బొట్టుకు పైసలు వసూలు చేయాలని ఆయన కోరారు. విలువైన నీరు వృధా చేయకుండా సంబంధిత సంస్థలకు ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. మహారాష్ట్రలో ఐపీఎల్‌ క్రికెట్‌ నిర్వహణ వల్ల చాలా నీరు వృధా అవుతుందని 'లోక్‌సత్తా మూవ్‌మెంట్‌' అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. కాగా దీనిపై బీసీసీఐ వాదన మరోలా ఉంది. తాము తాగునీరు కాకుండా ఇతర నీటిని పిచ్‌లను తడిపేందుకు ఉపయోగిస్తున్నామని ఆ సంస్థ నిర్వహకులు చెబుతున్నారు. నాగపూర్‌, పుణే, ముంబయి నగరాల్లో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి టికెట్లను అమ్మేశామని, ఇప్పుడు వీటిని రద్దు చేస్తే చాలా నష్టపోతామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment