Saturday, February 13, 2016

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా రివ్యూ


మతిమరపు కుర్రాడు ప్రేమలో పడితే పడే పాట్లేంటో చూపించి ప్రేక్షకులని ఫ్లాట్‌ చేసేసిన నాని 'భలే భలే' బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఈసారి పిరికి ప్రేమికుడి అవతారమెత్తాడు. చిన్నప్పుడే మహాలక్ష్మి ప్రేమలో పడి, పదిహేనేళ్లయినా ఆ ప్రేమ గురించి కనీసం తన స్నేహితులకి కూడా చెప్పుకోలేని కృష్ణగాడి 'వీర' ప్రేమగాథ ఇది. హీరోయిన్‌ అన్నయ్యో పెద్ద రౌడీ. ఒంటి చేత్తో ఎంత మందినైనా నరికి అవతలేసే వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నానని పిరికి హీరో ఎలా చెప్పగలడు? అవడానికి కృష్ణగాడి ప్రేమకథే అయినా దాంట్లో 'వీరత్వం' కోణాన్ని జోడించడం కోసం దర్శకుడు హను రాఘవపూడి వేరే ఉపకథలు సిద్ధం చేసి మెయిన్‌ లైన్‌లోకి తెలివిగా కలిపాడు. 
                   రొమాంటిక్‌ సినిమాలో థ్రిల్లర్‌, కామెడీ, యాక్షన్‌ వగైరా జోనర్లన్నీ చేరి ఒక కొత్త రకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇదే కథని చాలా వైల్డ్‌గా, వయొలెంట్‌గా చెప్పవచ్చు. కానీ దర్శకుడు వినోదాన్ని నమ్ముకున్నాడు. హీరో కార్లోకి చేరి, కథ హైవే ఎక్కేసరికి ఇక ఫన్‌కి చోటు లేదనుకుంటే... అనూహ్యమైన పాత్రలతో కామెడీ సృష్టించి నవ్వులకి లోటు లేకుండా చూసుకున్నాడు. హ్యూమర్‌ పండించే విషయంలో దర్శకుడి క్రియేటివిటీ చాలా సందర్భాల్లో విశేషంగా మెప్పిస్తుంది. హీరో పిరికితనంపై బేస్‌ చేసుకుని అందించిన ఫన్‌ ఒకెత్తు అయితే, బ్రహ్మాజీ క్యారెక్టర్‌ బండారం బయటపడే సీన్‌, మురళీశర్మ-పృధ్వీ-ప్రభాస్‌ శ్రీను ట్రాక్‌, చిన్న పాప, ఆమె చేతిలోని బొమ్మ చుట్టూ అల్లుకున్న సీన్స్‌ బాగా నవ్విస్తాయి. 
నిజానికి కృష్ణగాడి ప్రేమకథ ఇంటర్వెల్‌కే కొలిక్కి వచ్చేస్తుంది. అక్కడ్నుంచీ అతని వీరగాథకి తెర లేస్తుంది. లవ్‌స్టోరీకి ఆల్‌మోస్ట్‌ శుభం కార్డు పడేసరికి 'నా జీవితంలో కష్టమైన హాఫ్‌ అయిపోయింది, ఇష్టమైన హాఫ్‌ ఇప్పుడు మొదలవుతుంది' అని ఇంటర్వెల్‌ దగ్గర కృష్ణగాడు ఆనందపడతాడు. కానీ తనకే కాదు, దర్శకుడికీ కష్టమైన హాఫ్‌ రెండోదే అవుతుంది. అంతదాకా తన ప్రేమ గురించి హీరోయిన్‌ అన్నకి తెలీకుండా తప్పించుకు తిరిగిన కృష్ణగాడు ఇప్పుడు ఎంతో మంది నుంచి వచ్చే ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ అటు తన మహాలక్ష్మిని, ఇటు ముగ్గురు పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఇంటర్వెల్‌ వరకు కామెడీతో కాలక్షేపం చేసిన దర్శకుడికి సెకండ్‌ హాఫ్‌లో అన్ని కథల్ని ఒక కొలిక్కి తెస్తూ, వినోదం మిస్‌ అవకుండా, అలాగే రోడ్‌ జర్నీ బోర్‌ కొట్టకుండా చూసుకోవాల్సిన పరీక్ష ఎదురవుతుంది. 
హీరో కాబట్టి కృష్ణగాడు సక్సెస్‌ అయిపోతాడనేది మనందరికీ తెలిసిందే. కానీ ఈ పరీక్షలో హను రాఘవపూడి ఎలా నెగ్గుకొస్తాడన్నదే కీలకం. చాలా సబ్‌ప్లాట్స్‌ ఉండడం, మెయిన్‌ స్టోరీలో కామెడీ తగ్గడం వల్ల వేరే ట్రాక్స్‌తో కామెడీ పండించాల్సి రావడం, ఇంటర్వెల్‌కి ముందు ఉన్నన్ని ట్విస్టులు క్లయిమాక్స్‌కి ముందు కూడా ఉండాలని ఆరాటపడడం వగైరా ఇబ్బందుల వల్ల కాసింత గందరగోళం నెలకొంటుంది. అయితే హను రాఘవపూడి చాలా వరకు తన తెలివితేటలతో మేనేజ్‌ చేసేసాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసమని సెకండ్‌ హాఫ్‌లో రెండు పాటలు ఇరికించాడు. కనీసం ఆ చివరి పాటనైనా ఎడిట్‌ చేసేసినట్టయితే బాగుండేది. హైవేలో దూసుకుపోతున్న బండిలోని పాసింజర్‌ సడన్‌గా 'లూ బ్రేక్‌'కి వెళ్లినట్టు అడ్డుపడి, 'త్వరగా కానివ్వండి' అనేలా తయారైందది. క్లయిమాక్స్‌లో పిల్లలపై పెట్టిన ఎమోషనల్‌ డ్రామా కూడా అవసరానికి మించి సాగదీసినట్టుంది. హీరోని 'బాలకృష్ణ' అభిమానిగా చూపించడం, దానికోసం కొన్ని సీన్లు జోడించడం ఏదో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలా ఉందే తప్ప దాని వల్ల కథకి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. 
               పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఇంత ఈజీనా అన్నట్టుగా ప్రతి పాత్రనీ రక్తి కట్టిస్తోన్న నాని మరోసారి అద్భుతమైన అభినయంతో ఈ కథకి రథ సారథి అయ్యాడు. వంక పెట్టలేని నటనతో తెరపై కృష్ణగాడే తప్ప నానిని కనిపించకుండా చేసాడు. చివర్లో ఎమోషనల్‌గా బరస్ట్‌ అయ్యే సీన్లో నానిలోని పరిపూర్ణ నటుడు కనిపిస్తాడు. హీరోయిన్‌ పాత్రలో మెహ్రీన్‌ తేలిపోయింది. కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మాయిని కాస్టూమ్స్‌తో కవర్‌ చేసే ప్రయత్నం జరిగింది. క్యూట్‌గా ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ డామినేటింగ్‌గా కనిపించాల్సిన పాత్రకి ఆమె న్యాయం చేయలేకపోయింది. సపోర్టింగ్‌ స్టార్‌ కాస్ట్‌ అంతా కూడా అలరించారు. ముఖ్యంగా బ్రహ్మాజీ, మురళీ శర్మ, పృధ్వీ, రాజేష్‌ కామెడీకి బాగా హెల్పయ్యారు. పిల్లల్లో చిన్న పాప నైనీ అయితే ముద్దుగా ఉండడమే కాకుండా చాలా సహజంగా నటించి మార్కులు కొట్టేసింది. 
సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ పెద్ద ఎస్సెట్‌ అయ్యాడు. సంగీతం కూడా రొటీన్‌గా కాకుండా ఫ్రెష్‌గా అనిపించింది. సంభాషణలు బాగున్నాయి. చిన్న సినిమా అని ఎక్కడా రాజీ పడకుండా రిచ్‌గా తెరకెక్కించడంలో ప్రొడ్యూసర్స్‌ ఎఫర్ట్స్‌ మెచ్చుకోవాలి. 'అందాల రాక్షసి' చిత్రాన్ని పొయెటిక్‌గా ప్రెజెంట్‌ చేసే ప్రయత్నంలో బోర్‌ కొట్టించిన హను రాఘవపూడి ఈసారి క్రియేటివ్‌గా కాంప్రమైజ్‌ కాకుండా ఒక మంచి ఎంటర్‌టైనర్‌ని అందించాడు. ఈ సినిమాతో అతడిని ఆడియన్స్‌ హైగా రేట్‌ చేస్తారు. తననుంచి మరిన్ని క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. 
               ట్విస్టులెక్కువయి, రన్నింగ్‌ టైమ్‌ కాసింత పెరిగి కృష్ణగాడి 'గాడీ' ఒక్కోసారి గాడి తప్పినా కానీ సరదా సందర్భాలు, థ్రిల్లింగ్‌ సన్నివేశాలు, అనూహ్యమైన మలుపులు, ఆకట్టుకునే పాత్రల సమ్మేళనంతో.. విసుగు లేని వినోదంతో అంతిమంగా వీర ప్రేమగాథ రక్తి కట్టిస్తుంది. 
బోటమ్‌ లైన్‌: వినోదభరిత ప్రేమగాథ!

No comments:

Post a Comment