Sunday, January 31, 2016

కంగారూలను క్లీన్‌స్వీప్‌ చేసేశారు


ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఉత్కంఠ చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో కంగారూలను క్లీన్‌స్వీప్‌ చేసేసింది. 198 పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం అయ్యాయి. హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌ (15 నాటౌట్‌: 12 బంతుల్లో 1×4, 1×6) వరుసగా తొలి రెండు బంతుల్ని ఫోర్‌, సిక్స్‌గా బాది మ్యాచ్‌ను మలుపుతిప్పగా.. సురేశ్‌ రైనా (49 నాటౌట్‌: 25 బంతుల్లో 6×4, 1×6) చివరి బంతిని బౌండరీకి తరలించి భారత్‌ను విజయ సంబరాల్లో ముంచెత్తాడు. టాప్‌ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ (52), శిఖర్‌ ధావన్‌ (26), విరాట్‌ కోహ్లి (50) సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 200/3తో లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
 వాట్సన్‌ అజేయ శతకం వృథా
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయపడిన అరోన్‌ ఫించ్‌ స్థానంలో ఆసీస్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన వాట్సన్‌ (124 నాటౌట్‌: 71 బంతుల్లో 10×4, 6×6) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా (14), షాన్‌ మార్ష్‌ (9), మాక్స్‌వెల్‌ (3) తక్కువ పరుగులకే వరుసగా పెవిలియన్‌ చేరుతున్నా.. వాట్సన్‌ ఎక్కడా జోరు తగ్గించకపోగా.. మరింత దూకుడుగా ఆడాడు. షాన్‌ మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కి 53 పరుగులు జతచేసిన షేన్‌ వాట్సన్‌.. నాలుగో వికెట్‌కి ట్రావీస్‌ హెడ్‌(26)తో కలిసి 7.5 ఓవర్లలోనే ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో ఆశిష్‌ నెహ్రా, అశ్విన్‌, జడేజా, యువరాజ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు.

No comments:

Post a Comment