Friday, January 1, 2016

నేను శైలజ సినిమా రివ్యూ

క‌థేంటి?
 హరి(రామ్)కి ప్రేమ పిచ్చి. చిన్న‌ప్ప‌టి నుంచీ ప్రేమ‌లో ప‌డ‌డం.. విఫ‌ల‌మ‌వ్వ‌డం హ‌రికి అల‌వాటు.
 

 శైలు (కీర్తి సురేష్‌)ని కూడా అలానే ప్రేమిస్తాడు. కానీ.. హరి కుటుంబం అంతా వైజాగ్ కి బ‌దిలీ అవ్వ‌డం వ‌ల్ల‌... శైలుకి దూరం అవ్వాల్సి వ‌స్తుంది. హ‌రి పెరిగి పెద్ద‌వాడైనా ప్రేమ‌క‌థ‌ల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రేమించిన ప్ర‌తి అమ్మాయి త‌న‌కు దూరం అవ్వ‌డం చూసి... ఇక ప్రేమ జోలికి వెళ్లొద్ద‌నుకొంటాడు. కానీ.. త‌న జీవితంలోకి శైలు మ‌ళ్లీ వ‌స్తుంది. ఈసారి శైలును మ‌రింత సిన్సియ‌ర్‌గా ప్రేమిస్తాడు.కానీ.. శైలు మాత్రం హ‌రి ప్రేమ‌కు `నో` చెప్తుంది. దానికి కార‌ణం ఏమిటి?  శైలు ప్రేమ‌ని హ‌రి ఎలా పొందాడు? అన్న‌దే మిగిలిన క‌థ‌.....

ఎలా ఉంది?
ఈ సినిమాలో ఉన్న‌ద‌ల్లా ప్రేమే!  తొలి స‌న్నివేశం నుంచి... చివ‌రి వ‌ర‌కూ ప్రేమ కోసం హ‌రి అనే కుర్రాడు ప‌డే ఆరాటం ఈ క‌థ‌. తెలియ‌ని క‌థ కాదు.. గొప్ప మ‌లుపులూ లేవు. కానీ.. అదే క‌థ‌ని చాలా తెలివిగా హ్యాండిల్ చేశాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌తీ స‌న్నివేశం కొత్త‌గా చెప్పాల‌న్న ప్ర‌య‌త్నం చేశాడు. మ‌రీ విర‌గ‌బ‌డి న‌వ్వేంత స‌న్నివేశాలు లేవు గానీ.. ప్ర‌తీ స‌న్నివేశంలోనూ ఏదో ర‌కంగా ప్రేక్ష‌కుల్ని న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. దాంతో.. సినిమా మొత్తం హాయిగా సాగిపోతున్న అనుభూతి క‌లుగుతుంది. నువ్వే నువ్వే.. నువ్వు నాకు న‌చ్చావ్ ఫ్లేవ‌ర్ ఈ సినిమాలో క‌నిపిస్తుంటుంది. కానీ రామ్ పాత్ర మ‌ల‌చిన తీరు.. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ ట‌ర్న్స్ ఈ సినిమాని కొత్త దారిలో న‌డిపిస్తుంటాయి. అయితే.. అదంతా తొలి స‌గ‌మే!  ద్వితీయార్థంలో  క‌థ‌నం న‌త్త‌డ‌న‌క న‌డుస్తుండ‌డంతో.. ప్రేక్ష‌కుడు ట్రాక్ త‌ప్పుతాడు. ఏ ప్రేమ‌క‌థైనా పండాలంటే భావోద్వేగాలు చాలా అవ‌స‌రం. అలాంటి స‌న్నివేశాలు రాసుకోవాలంటే పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ పుట్టాలి. అది.. ఈ సినిమాలో లోపించింది. ఎంత సేపూ క‌థానాయ‌కుడి పాత్ర‌నే ఎలివేట్ చేయాల‌న్న త‌పన‌తో మిగిలిన పాత్ర‌ల్ని గాలికి వ‌దిలేశాడు. తొలి స‌గంలో క‌థానాయిక పాత్ర‌ని బాగా మ‌ల‌చుకొన్న ద‌ర్శ‌కుడు.. మ‌లి స‌గంలో ఆ పాత్ర‌ని విస్మ‌రించాడు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ పండించే అవ‌కాశం ఉన్నా.. వాటిపై పెద్ద గా దృష్టి పెట్టలేదు. ప‌తాక స‌న్నివేశాలు కూడా. ఏదో ముగించాల‌న్న‌ట్టు సాగిపోతాయి. దాంతో... ఓ ర‌క‌మైన అసంతృప్తితో ప్రేక్ష‌కుడు థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు. క‌థ‌ని చాలా అందంగా మొద‌లెట్టిన ద‌ర్శ‌కుడు అర్థ‌వంతంగా ముగించలేక‌పోయాడు. ప‌తాక స‌న్నివేశాల ప‌ట్ల ద‌ర్శ‌కుడు ఇంకాస్త శ్ర‌ద్ధ చూపిస్తే.. బాగుండేది.
ఎవ‌రెలా?
రామ్ చాలా కొత్త‌గా క‌నిపించాడు. త‌న బాడీలాంగ్వేజ్ కూడా మారింది. హ‌రి పాత్ర తాలూకు స్వ‌భావాన్ని బాగా ఆక‌ళింపు చేసుకొన్నాడు. ప్ర‌తీ స‌న్నివేశాన్నీ త‌న భుజాల‌పై వేసుకొని న‌డిపించాడు. త‌న ఎన‌ర్జీ  స్థాయిని ఈ సినిమాతో మ‌రోసారి చూపించాడు. కీర్తి సురేష్‌కి ఇదే తొలి సినిమా. వీరిద్ద‌రి జంట తెర‌పై చూడ్డానికి బాగుంది. కీర్తిది కాస్త డెప్త్ ఉన్న పాత్రే. కొన్నిచోట్ల తేలిపోయినా... చాలా వ‌ర‌కూ మెప్పించింది. స‌త్య‌రాజ్ మ‌రోసారి ఆక‌ట్టుకొంటారు. ఆ పాత్ర‌లో హుందాగా క‌నిపించారు. మిగిలిన‌వాళ్లంతా త‌మ ప‌రిధిమేర న‌టించి.. వారి వారి పాత్ర‌ల్ని రక్తి క‌ట్టించారు.
సాంకేతికంగా
దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన బాణీలు త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకొంటాయి. శైల‌జ‌.. శైల‌జ పాట‌ని చిత్రీక‌రించిన తీరు ఆక‌ట్టుకొంటుంది. సిరివెన్నెల సాహిత్యం.. అర్థ‌వంతంగా సాగింది. ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌కు ఇదే తొలి చిత్రం. కొన్ని స‌న్నివేశాల్ని అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిగా డీల్ చేశాడు. ద్వితీయార్థంలో క‌థ‌నం విష‌యంలో దృష్టి పెడితే బాగుండేది. కామెడీ కోసం ప్ర‌త్యేకంగా ట్రాక్స్ జోడించ‌కుండా మంచి ప‌ని చేశాడు. రాసుకొన్న క‌థ‌లో, పాత్ర‌ల్ని మ‌ల‌చుకొన్న తీరులోనే వినోదం పండించాడు.
చివ‌రగా: మెచ్చుకోద‌గిన ప్ర‌య‌త్నం.. స‌రికొత్త‌గా ‘నేను-శైల‌జ’

No comments:

Post a Comment